హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గచ్చిబౌలిలో బుధవారం ఇంటిగ్రేటెడ్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, ఫైవ్‌స్టార్ హోటల్, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ స్థాయిలో సౌకర్యాలు కలిగిన కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 11 కార్యాలయాలు పూర్తి చేయాలని సంబంధిత మంత్రికి ఆదేశించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 2034 నాటికి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ చారిత్రాత్మక నగరమని, కుతుబ్‌షాహీలు నుంచి నేటి పాలకుల వరకు ఎన్నో కృషుల వల్లే ఈ స్థాయికి చేరిందని గుర్తుచేశారు. ఐటీ రంగ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్రను వివరించారు. హైటెక్ సిటీ అభివృద్ధి దేశానికి ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు.

హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరు, చెన్నైతో కాదు, టోక్యో, న్యూయార్క్‌లాంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

మూసీ ప్రక్షాళన ద్వారా పాతబస్తీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, గోదావరి జలాలను భాగ్యనగరానికి తేవడం ద్వారా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల కోసం రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులు చేపడతామని, నగర విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read More : తెలంగాణలో యూరియా కొరతపై హరీష్ రావు ఫైర్