అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

అమెరికాలో మరోసారి ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ స్వామినారాయణ్ హిందూ ఆలయం ఈసారి లక్ష్యంగా మారింది. ఆలయ వెలుపలి గోడలపై భారత వ్యతిరేక నినాదాలు, ఖలిస్థానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను పొగుడుతూ స్ప్రే పెయింట్‌తో రాతలు వేశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో ఆందోళనను రేపింది.

ఆలయ నిర్వాహకులు ఈ దుశ్చర్యను గుర్తించగానే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన నెవార్క్ పోలీసులు, ఇది సాధారణ విధ్వంసం కాదని, ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని తెలిపారు. ఇప్పటికే ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. భారతీయ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేసింది.

నిర్వాహకుల ప్రకారం, అమెరికాలో హిందూ దేవాలయాలపై ఈ ఏడాదిలో చోటుచేసుకున్న దాడుల్లో ఇది నాలుగో ఘటన.

Read More : భారత్–పాక్ సంబంధాలపై అమెరికా స్పష్టం