భారత్, పాకిస్థాన్ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ సైనిక నాయకత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరుపుతున్న చర్చలు, ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టంచేసింది. అందరితో సంభాషణలు జరపగల అధ్యక్షుడు ఉండటం వల్ల విభేదాలను పరిష్కరించడం సులభమవుతుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి – “పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ బంధం, మోదీతో సంబంధాలపై ప్రభావం చూపుతుందా?” అని అడగగా, టమ్మీ బ్రూస్ – “రెండు దేశాలతో మా సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. మా దౌత్యవేత్తలు ఇరు దేశాల విషయంలో కట్టుబడి ఉన్నారు” అని సమాధానమిచ్చారు. సమస్యల పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని, ట్రంప్ దౌత్యాన్ని ఆమె సమర్థించారు.
ఇటీవల భారత్–పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను అమెరికా జోక్యంతోనే తగ్గించగలిగామని ఆమె పునరుద్ఘాటించారు. “ఆ ఘర్షణ మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉండేది. కానీ అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తక్షణం స్పందించి, దాడులను ఆపడంతో పాటు ఇరు పక్షాలను చర్చలకు ఒప్పించారు. ఇది మాకు గర్వకారణమైన క్షణం” అని టమ్మీ బ్రూస్ అన్నారు.
అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న వాదనను భారత్ ఇప్పటికే ఖండించింది. ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం తమ మధ్యవర్తిత్వానికి గానూ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం.
అదే సమయంలో, ట్రంప్–మునీర్ సాన్నిహిత్యం వల్ల పాకిస్థాన్‌కు అమెరికా నుంచి ఆయుధాలు, సాయం పెరుగుతాయా? అనే ప్రశ్నకు టమ్మీ బ్రూస్ నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అయితే, ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్చలను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదంపై పోరులో పాక్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.
Read More : సింధు జలాలపై భారత్–పాక్ ఘర్షణ

One thought on “భారత్–పాక్ సంబంధాలపై అమెరికా స్పష్టం”
Comments are closed.