గాజాలో ఇజ్రాయెల్ దాడి… అల్ జజీరా జర్నలిస్టులు మృతి

గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి పెద్ద విషాదానికి కారణమైంది. ఆసుపత్రి ప్రధాన ద్వారం బయట మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో అల్ జజీరా నెట్‌వర్క్‌కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు మృతి చెందారు. ఈ ఘటనను అల్ జజీరా ఆదివారం ధృవీకరిస్తూ, తమ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేశారని ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. మరణించిన జర్నలిస్టుల్లో ప్రతినిధులు అనస్ అల్-షరీఫ్ (28), మహమ్మద్ ఖ్రీఖే, కెమెరామెన్లు ఇబ్రహీం జహర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలివా ఉన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇక, ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఈ దాడిని అంగీకరించినప్పటికీ, తాము జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. అనస్ అల్-షరీఫ్ హమాస్‌లోని ఒక సెల్‌కు నాయకత్వం వహించాడని, ఇజ్రాయెల్ పౌరులు మరియు సైనికులపై రాకెట్ దాడులకు బాధ్యత వహించాడని ఆరోపించింది.

చనిపోవడానికి కొద్ది గంటల ముందు అనస్ అల్-షరీఫ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో గాజా నగరంపై దాడులు తీవ్రతరం అయ్యాయని పోస్టు చేశారు. ఆయన మరణం తరువాత, అతని ఖాతా నుంచి ఒక హృదయాన్ని కదిలించే సందేశం వెలువడింది – “నా మాటలు మీకు చేరితే, నన్ను చంపి నా గొంతును మూయించడంలో ఇజ్రాయెల్ విజయవంతమైందని అర్థం చేసుకోండి” అని అందులో వుంది.

ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ (సీపీజే) ఎలాంటి ఆధారాలు లేకుండా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్రవేయడం ఇజ్రాయెల్ ఉద్దేశాలను ప్రశ్నార్థకంగా మారుస్తుందని పేర్కొంది. జర్నలిస్టులు పౌరులని, వారిని లక్ష్యం చేయకూడదని స్పష్టం చేసింది. పాలస్తీనియన్ జర్నలిస్ట్స్ సిండికేట్ దీనిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించింది.

గాజాలో 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది మీడియా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు, ఖతార్‌కు చెందిన అల్ జజీరా నెట్‌వర్క్‌కు మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. తాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్, తమ దేశంలో అల్ జజీరా ప్రసారాలను నిషేధించి, వారి కార్యాలయాలపై దాడులు కూడా చేసింది.

Read More : గాజా ఆక్రమణ కాదంటున్న నెతన్యాహు

One thought on “గాజాలో ఇజ్రాయెల్ దాడి… అల్ జజీరా జర్నలిస్టులు మృతి

Comments are closed.