బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ ఖురేషి (42) ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బైక్ పార్కింగ్ వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, గురువారం రాత్రి సుమారు 10:30 గంటలకు నిందితుల స్కూటర్‌ను ఆసిఫ్ ఖురేషి ఇంటి గేటు ముందు పార్క్ చేశారు. వాహనాన్ని తొలగించమని ఆసిఫ్ కోరడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వాగ్వాదం క్షణాల్లో ఘర్షణగా మారి, నిందితులు పదునైన ఆయుధాలతో ఆసిఫ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆసిఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చేరుకునే సమయానికే వైద్యులు అతను మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో, పలువురు చూస్తుండగానే దుండగులు ఆసిఫ్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొడవను ఆపేందుకు కొందరు ప్రయత్నించినా, నిందితులు ఆగకుండా దాడి కొనసాగించారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని, మళ్లీ అదే కారణంతో ఈసారి ఘర్షణ తీవ్రరూపం దాల్చిందని ఆసిఫ్ భార్య పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Read More : బుల్లెట్ రైలు మార్గంలో శబ్ద కాలుష్యం నియంత్రణ

One thought on “ఢిల్లీలో హుమా ఖురేషి బంధువు హత్య”
Comments are closed.