రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుంది

KTR

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాబోయే రెండున్నరేళ్లలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే ప్రతి ఒక్కరి లెక్కలు సరిచేస్తామన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “ఏం చేస్తున్నారో ఆయన్నే అర్థం కావడం లేదు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల విలువలు పడిపోయాయి” అని వ్యాఖ్యానించారు.

ఇంతేకాక, రేషన్ కార్డుల అంశంలో ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. “బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదనడం అసత్యం. అధికారులు రాజకీయాల్లో పాల్గొనడం సరికాదు” అని స్పష్టం చేశారు.

రుణమాఫీ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ‘రైతుబంధు’ నిలిపివేయనున్న ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందని ఆరోపించారు.

“కేసీఆర్ పేరు చెబితే రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది. అందుకే ఢిల్లీలోనూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. గత పాలనలో జరిగిన మంచి పనులను ప్రజలకు చెప్పలేకపోయినందునే ఓటమి పాలయ్యామని అన్నారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలన్నదే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

One thought on “రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుంది

Comments are closed.