పాకిస్థాన్ మద్దతు మరోసారి బహిర్గతం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జరిగిన ఒక అంత్యక్రియల కార్యక్రమం సరిహద్దు ఉగ్రవాదంపై మరోసారి చర్చకు దారితీసింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందన్న భారత్ ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా శ్రీనగర్ హర్వాన్‌లో భద్రతా దళాలు లష్కరే తాయిబా ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ నిర్వహించగా, హబీబ్ తాహిర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జులై 30న పీవోకేలోని కుయియాన్ గ్రామంలో హబీబ్ తాహిర్ అంత్యక్రియలు జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ప్రకారం ఈ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. లష్కరే తాయిబా కమాండర్ రిజ్వాన్ హనీఫ్ తన అనుచరులతో కలిసి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అంత్యక్రియల సమయంలో హనీఫ్ మేనల్లుడు తుపాకీతో బెదిరించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, హనీఫ్ బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది.

హబీబ్ తాహిర్‌ను లష్కరే తాయిబా సంస్థే రిక్రూట్ చేసి శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. గతంలో ‘ఆపరేషన్ సిందూర్‌’లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ సైన్యాధికారులు హాజరైనట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ అంత్యక్రియలను అమెరికా నిషేధించిన గ్లోబల్ టెర్రరిస్ట్, ఎల్‌ఈటే కమాండర్ అబ్దుల్ రవూఫ్ పర్యవేక్షించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలు పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు లభిస్తున్న బలమైన మద్దతును మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి.

Read More : కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ రగులుకున్నాయి !

One thought on “పాకిస్థాన్ మద్దతు మరోసారి బహిర్గతం

Comments are closed.