ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత

ఝార్ఖండ్ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల క్రితం స్ట్రోక్‌కు గురైన శిబు సోరెన్ అప్పటి నుంచి లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు. తన తండ్రి మరణవార్తను ప్రస్తుత ఝార్ఖండ్ సీఎం, కుమారుడు హేమంత్ సోరెన్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. “గౌరవనీయులైన దిశోమ్ గురు మనందరినీ విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు నేను ఒంటరినైపోయాను…” అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.

ప్రజలు ప్రేమగా “గురూజీ”, “దిశోమ్ గురు” అని పిలిచే శిబు సోరెన్ ఝార్ఖండ్ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కీలక పదవులు చేపట్టారు. గిరిజన హక్కుల కోసం, ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమైంది. ఈ కృషితోనే ఆయనను “ఆధునిక ఝార్ఖండ్ పితామహుడు”గా గౌరవిస్తారు.

1944లో నేటి ఝార్ఖండ్‌లోని నేమ్రా గ్రామంలో జన్మించిన సోరెన్ జీవితంలో పెద్ద మలుపు ఆయన తండ్రి హత్యతో వచ్చింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా 10వ తరగతితోనే చదువును ఆపిన ఆయన, 18 ఏళ్లకే గిరిజన యువతను సమీకరించేందుకు “సంథాల్ నవయువక్ సంఘ్”ను స్థాపించారు. ఈ సంఘమే తర్వాత ఝార్ఖండ్ ముక్తి మోర్చా పుట్టుకకు పునాది వేసింది.

శిబు సోరెన్ అంత్యక్రియల వివరాలను త్వరలో ప్రకటిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read More : పాకిస్థాన్ మద్దతు మరోసారి బహిర్గతం

One thought on “ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత

Comments are closed.