బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్నామనే ధైర్యంతో బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని నిలదీశారు. “మా తెలంగాణ హక్కుల సంగతేంటి? సీఎం, నీటి పారుదల మంత్రి, కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు.
లోపాయికారి ఒప్పందాల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకుందని హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి-బనకచర్ల అంశం అజెండాలో ఉంటే ఉమ్మడి రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడం సరికాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాసినా, సీఎం, అధికారులు ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొని కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకరించారని గుర్తు చేశారు.
“కాంగ్రెస్ నేతల ధైర్యం చూసి లోకేశ్ బనకచర్ల కట్టి తీరుతామని చెబుతున్నారు. చంద్రబాబు బుల్డోజింగ్ విధానాన్ని అవలంబిస్తుండటానికి కారణం కాంగ్రెస్, బీజేపీల మౌనమే” అని విమర్శించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై “కడితే అడ్డుకుంటాం” అనడం విడ్డూరంగా ఉందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని, బీజేపీ ఢిల్లీలో తన పీఠం కోసం మౌనంగా ఉంటోందని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More : జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించిన సీఎం

One thought on “బనకచర్లపై మౌనం ఎందుకు?”
Comments are closed.