ఇరాన్‌తో పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల లావాదేవీల్లో పాల్గొన్నందుకు భారత్ సహా పలు దేశాలకు చెందిన సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయని అమెరికా అధికారికంగా ప్రకటించింది. టర్కీ, యూఏఈ, చైనా, ఇండోనేషియాకు చెందిన సంస్థలు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చాయి.
అమెరికా ఆరోపణల ప్రకారం, ఈ భారతీయ సంస్థలు 2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్య మిథనాల్, టోలుయీన్, పాలిథిలీన్ వంటి పదార్థాలను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న భారతీయ కంపెనీల జాబితాలో కాంచన్ పాలిమర్స్, ఆల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రామనీక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ సంస్థలు మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాయని అమెరికా స్పష్టం చేసింది.
“ఈ ఆంక్షలు కేవలం సాంకేతిక చర్యలు కావు. అమెరికాలో లేదా అమెరికా వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ సంస్థల ఆస్తులు, ఆస్తి హక్కులు బ్లాక్ అవుతాయి” అని అమెరికా తెలిపింది. అయితే, “ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశ్యం శిక్షించడం కాదు, సానుకూల మార్పును తీసుకురావడం” అని స్పష్టం చేసింది.
ఈ ఆంక్షలపై భారతీయ సంస్థలు ఇంకా బహిరంగంగా స్పందించలేదు.
Read More : కాలిఫోర్నియాలో ఎఫ్-35 యుద్ధ విమానం కూలింది

One thought on “అమెరికా ఆంక్షల వలలో ఆరు భారతీయ కంపెనీలు”
Comments are closed.