దేశవ్యాప్తంగా అపార్ట్‌మెంట్లలో నివసించే లక్షలాది కుటుంబాలకు మరియు వాటి సంక్షేమ సంఘాలకు జీఎస్టీ (GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అపార్ట్‌మెంట్ నిర్వహణ (మెయింటెనెన్స్) ఛార్జీలపై జీఎస్టీ విధింపునకు సంబంధించి నెలలుగా కొనసాగుతున్న సందేహాలకు తెరదిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో కీలక వివరాలు వెల్లడించారు. నిర్మలా సీతారామన్ ప్రకారం, నెలవారీ నిర్వహణ ఛార్జీ ప్రతి సభ్యుడికి రూ.7,500 దాటినప్పుడు మాత్రమే జీఎస్టీ వర్తిస్తుంది. అదనంగా, అసోసియేషన్ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు (ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో రూ.10 లక్షలు) దాటినప్పుడే జీఎస్టీ పరిధిలోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ రెండు నిబంధనలు నెరవేరినప్పుడు మాత్రమే అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
జీఎస్టీ భారం నేరుగా నివాసితులపై పడదని, దానిని చెల్లించే బాధ్యత పూర్తిగా అసోసియేషన్లదేనని మంత్రి హామీ ఇచ్చారు. “నివాసితులు ఎంత మెయింటెనెన్స్ చెల్లించినా, వారిపై జీఎస్టీకి సంబంధించిన ఎలాంటి నిబంధనలు ఉండవు” అని ఆమె స్పష్టం చేశారు.
గతంలో ఈ పరిమితి రూ.5,000గా ఉండేదని, 2018 జనవరి 18న జరిగిన 25వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సిఫార్సుల మేరకు దానిని రూ.7,500కు పెంచినట్లు గుర్తుచేశారు. అలాగే బకాయిపడ్డ పన్నులను నిర్ణీత గడువులో చెల్లిస్తే జరిమానా లేకుండా లేదా తక్కువ జరిమానాతో చెల్లించే అవకాశం కల్పించామని తెలిపారు. జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జీఎస్టీకి సంబంధించిన సమాచారం కోసం అసోసియేషన్లు తమ నివాసితుల నుంచి అధికారిక లేఖలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
Read More : యెమెన్‌లో నిమిష ప్రియ విడుదల కోసం కేఏ పాల్ విజ్ఞప్తి

One thought on “అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి స్పష్టత”
Comments are closed.