ధన్ ఖడ్ కు వీడ్కోలు చెప్పడానికి కేంద్రం మౌనం వెనుకున్న కారణం?

ఉప రాష్ట్రపతిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్ ఖడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు ధన్ ఖడ్ పేర్కొన్నప్పటికీ విపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. వాటికి బలం చేకూర్చేలా ఆయనకు అధికారికంగా వీడ్కోలు పలుకుదామని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దాంతో విపక్షాలే ఆయనకు వీడ్కోలు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ కార్యక్రమానికి జగదీప్ ను ఆహ్వానించినట్లు సమాచారం.

ఇక రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారమే ఆమోదించారు. కేంద్ర హోంశాఖ కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం అటు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు ప్రారంభించింది.ఇలా అన్ని జరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో ధన్ ఖడ్ కు వీడ్కోలు పలకాలని ఇప్పటికే కాంగ్రెస్ కోరిందని, కానీ కేంద్రం మాత్రం మౌనం వహించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ధన్ ఖడ్ కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. అయితే, కేంద్రం దీనిపై స్పందించలేదు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా కూడా ఈ విషయంపై ఏం మాట్లాడలేదని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రం అనుసరిస్తోన్న ఈ తీరు కూడా విపక్షాల అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఇక, విపక్షాల ఆహ్వానాన్ని ధన్ ఖడ్ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, తన అధికారిక నివాసాన్ని త్వరలోనే ఖాళీ చేసే యోచనలో ధనఖడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వస్తువులను మంగళవారం నుంచే ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని చర్చి రోడ్డులో కొత్తగా నిర్మించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్ క్లేవ్ కు (VP Enclave) జగదీప్ ధన్ ఖడ్ గతేడాది ఏప్రిల్ లో మారారు. ఉప రాష్ట్రపతి అధికార నివాసం, కార్యాలయంగా ఉండే ఆ వీపీ ఎన్ క్లేవ్ సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. గత 15 నెలలుగా ధన్ ఖడ్ అక్కడే నివాసముంటున్నారు.

Read more : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

One thought on “ధన్ ఖడ్ కు వీడ్కోలు చెప్పడానికి కేంద్రం మౌనం వెనుకున్న కారణం?

Comments are closed.