డీకే అరుణ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అందరికీ సుపరిచితురాలు. ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా అరుణ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అనేక అంశాలపై తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారన్నారు. తనతో పాటు తన కుటుంబం ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాట్లాడారని.. కానీ, ఇప్పుడు ఆయన అవన్నీ మరిచినట్టుగా, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా అనే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
అలాంటప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నాటకమా..? లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా..? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్యాకేజీ బేరాలు కుదిరాయనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు కేవలం మాటల యుద్ధం, కుమ్ములాటలు చేసుకుంటూ, చీకట్లో ప్యాకేజీలు కుదుర్చుకుంటున్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై ఇప్పటికే కేంద్ర వ్యవస్థలు సంచలన విషయాలను బయటపెట్టాయన్నారు. ఈ విషయంలో నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచంగా మారారన్నారు. రూ.38,000 కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 1.2 లక్షల కోట్లకు పెంచిన సంగతి తెలిసిందేనని.. వేల కోట్లు వృథా చేసినట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలు స్పష్టంగా పేర్కొన్నాయన్నారు.

One thought on “కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై డీకే అరుణ ఘాటు విమర్శలు”
Comments are closed.