ఏఈ కిషోర్ సూసైడ్ నోట్ కలకలం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విషాదం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) వి. కిషోర్ మిస్సింగ్ అయిన తరువాత, ఆయన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కలకలం రేగింది.

ఈ సూసైడ్ నోట్‌లో, తన మరణానికి కారణంగా నలుగురు ఉన్నతాధికారులు — EE రంగయ్య, DEE ఉమాశంకర్, ENC శ్యామ్ ప్రసాద్ — మరియు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించారు. బదిలీ అనంతరం రిలీవ్ చేయకపోవడం, ఎమ్మెల్యే ఆదేశాలతో బదిలీని నిలిపివేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని కిషోర్ పేర్కొన్నారు. తనపై జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నిమ్మల రామానాయుడులకు లేఖలు రాశారు.

“ఒక దళిత ఉద్యోగిగా న్యాయం కోసం పలుమార్లు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ ఆఫీసుల చుట్టూ తిరిగినా స్పందన రాలేదు. చివరికి గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను” అని సూసైడ్ నోట్‌లో కిషోర్ వేదన వెల్లడించారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కిషోర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read More : తిరుమలలో టీటీడీ ఉద్యోగుల సస్పెన్షన్