హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో జరుగుతున్న భారీ అవకతవకలపై ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించింది. హెచ్‌సీఏ స్కామ్‌పై ఇప్పటికే సీఐడీ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ స్కాంలో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయేమో అన్న కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది.
ఈ దశలో, సీఐడీ నుంచి కేసు వివరాలు కోరుతూ ఈడీ అధికారికంగా లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు, దర్యాప్తు నివేదికలు వంటి పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, ఈడీ తమదైన ఈసీఐఆర్ నమోదు చేయనుంది. దీంతో, ఈ కేసు మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశముంది. ఇప్పటికే హెచ్‌సీఏ అవకతవకల కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. అదే విధంగా, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత చంచల్‌గూడా మహిళా జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో, రెండు మూడు రోజుల్లో సీఐడీ నుంచి పూర్తి కేసు వివరాలు అందిన తర్వాత, ఈడీ నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ మొదలుపెట్టే అవకాశముంది. ప్రస్తుతం నిందితులు జైలులో ఉండటంతో, కోర్టు అనుమతి పొందిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఈ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ సమగ్రంగా విచారణ జరపనుంది. దీనితో హెచ్‌సీఏ స్కాం కేసు మరింత గంభీరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More : Day 2లో వికెట్ కీపింగ్ బాధ్యతలు ధ్రువ్ జురేల్‌దే

2 thoughts on “హెచ్‌సీఏ స్కాంపై ఈడీ దర్యాప్తు ప్రారంభం”
Comments are closed.