రేవంత్ రెడ్డి ఘన నివాళి – వైఎస్సార్ జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “వైఎస్సార్ తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగు రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలు ఆయన ప్రజలపట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తాయి” అని ప్రశంసించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే వైఎస్సార్ ఆశయమని, ఆ కలను సాకారం చేసేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా సీఎం నివాళులర్పించారు. క్లిష్ట సమయంలో దేశానికి ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ కీలక నాయకుడిగా చంద్రశేఖర్ బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More : హైదరాబాద్ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

One thought on “రేవంత్ రెడ్డి ఘన నివాళి – వైఎస్సార్ జయంతి

Comments are closed.