సిగాచి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 44కి చేరింది

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటన మరింత విషాదంగా మారుతోంది. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 44కి చేరినట్టు అధికారులు ప్రకటించారు. తాజాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్మికులు మంగళవారం మరణించారని వెల్లడించారు. వివరాల ప్రకారం… ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చేరిన ఆరిఫ్ తుదిశ్వాస విడిచారు. పేలుడు జరిగిన జూన్ 30 తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం ఈ ఘటన తీవ్రతను చూపుతోంది. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పటాన్‌చెరు మండలంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న ఈ పేలుడు సంభవించగా, ఇప్పటికీ ఎనిమిది మంది కార్మికులు గల్లంతై ఉన్నారు. వారి కోసం ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, హైడ్రా యంత్రాలు, పోలీస్ బృందాలతో సహా రక్షణ సిబ్బంది శిథిలాల కింద గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సహాయ కేంద్రం వద్ద గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించింది. గాయపడిన కార్మికులకు పూర్తి చికిత్స ఖర్చులను భరించాలని, అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అండగా ఉంటామని సంస్థ భరోసా ఇచ్చింది.

Read More : హైదర్‌గూడలో హైడ్రా కూల్చివేతలు…

One thought on “సిగాచి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 44కి చేరింది

Comments are closed.