హిమాచల్‌లో కుక్క చిత్తశుద్ధి: 67 మందికి ప్రాణభయం నుంచి రక్షణ

హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర వర్షాల కారణంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ… ఓ మూగజీవి చూపిన చిత్తశుద్ధి 67 మంది ప్రాణాలను కాపాడింది. మండి జిల్లాలోని ధర్మపూర్ మండలానికి చెందిన సియాతి గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడిన సమయంలో, గ్రామంలోని ఓ ఇంట్లో పెంపుడు కుక్క అరవడంతో 20 కుటుంబాలు అప్రమత్తమై, ప్రాణాలతో బయటపడగలిగారు. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన నరేంద్ర ఇంట్లో కుక్క అర్ధరాత్రి నుంచి నిరంతరం అరవడం ప్రారంభించింది. “ఆ శబ్దాలతో మేల్కొన్న నేను ఇంటి గోడలు పగిలి, లోపలికి నీరు ప్రవేశిస్తున్న దృశ్యాన్ని చూశాను. వెంటనే కుక్కను తీసుకుని బయటకు పరుగెత్తాను. తరువాత నా కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులందరినీ నిద్రలేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పా” అని నరేంద్ర తెలిపారు.

అప్పటి కాసేపటికే భారీ కొండచరియలు విరిగి పడి గ్రామంలోని చాలా ఇళ్లను కూల్చేశాయి. ఆ గ్రామంలో దాదాపు 20 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన వారు ప్రస్తుతం సమీపంలోని నైనా దేవి ఆలయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ఈ సంఘటన తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించిందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బాధితులకు రూ.10,000 చొప్పున తక్షణ సాయం అందించింది. రుతుపవనాల కారణంగా జూన్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో 50 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల్లో మరో 28 మంది మరణించారు. మొత్తం 78 మంది చనిపోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 16 కొండచరియలు, 19 మేఘ విస్ఫోటాలు, 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. వీటిలో అత్యధికంగా మండి జిల్లానే తీవ్రంగా ప్రభావితమైంది. మరోవైపు, వాతావరణ శాఖ రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికను జారీ చేసింది.

Read More : రీల్స్ పిచ్చిలో చిన్నారి ప్రాణాన్ని పణంగా పెట్టిన తండ్రి…

One thought on “హిమాచల్‌లో కుక్క చిత్తశుద్ధి: 67 మందికి ప్రాణభయం నుంచి రక్షణ

Comments are closed.