ఉగ్రవాదుల చెరలో పల్నాడు వ్యక్తి, కుటుంబంలో ఆందోళన

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో జరిగిన ఉగ్రదాడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన కిడ్నాప్ ఘటనలో ముగ్గురు భారతీయులు చిక్కుకోవడంతో పాటు, వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించడంతో విషాదం మరింత పెరిగింది. పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన జమ్మలమడక గ్రామస్తుడు అమరలింగేశ్వర రావు (55) ఈ దాడిలో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నట్టు సమాచారం. ఆయన మాలీలో గత 15 ఏళ్లుగా డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఉగ్రవాదులు ఆ ఫ్యాక్టరీపై దాడికి పాల్పడి, ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులను అపహరించారని సమాచారం. ప్రస్తుతం మిర్యాలగూడలో నివసిస్తున్న అమరలింగేశ్వర రావు కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. కేవలం రెండు నెలల క్రితమే ఆయన భార్య రమణ, పిల్లలు హైదరాబాద్‌కు మారారు. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే ఆయన తండ్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైయ్యారు. తమ కుమారుడిని సురక్షితంగా విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కన్నీరుమున్నీరు అయ్యారు.

హైదరాబాద్‌లో ఉన్న అమరలింగేశ్వర రావు కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ పూర్తి సమాచారం సేకరిస్తుండగా, అధికారికంగా స్పందన వచ్చే అవకాశం ఉంది.

Read More : ఏపీలో రేపు కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు