అర్జెంటీనా పర్యటనకు మోదీకి ఘన స్వాగతం

అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్యూనస్ ఎయిర్స్‌లో ఘన స్వాగతం లభించింది. అల్వియర్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ‘మోదీ మోదీ’, ‘జై హింద్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ఘన అభినందనలు తెలిపారు. హోటల్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా, స్థానిక ప్రవాసులు సంప్రదాయ శాస్త్రీయ నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగడంతో పాటు ఆటోగ్రాఫ్‌లు తీసుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పర్యటన ప్రారంభంలో ఎజీజా అంతర్జాతీయ విమానాశ్రయంలో అర్జెంటీనా ప్రభుత్వం అధికారికంగా లాంఛనప్రాయ స్వాగతం పలికింది.
ఈ పర్యటన చారిత్రాత్మకంగా నిలవనుంది. దాదాపు 57 సంవత్సరాల విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు అర్జెంటీనాను ద్వైపాక్షిక పర్యటనలో సందర్శించడం ఇదే తొలిసారి. “అర్జెంటీనాతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బ్యూనస్ ఎయిర్స్‌కి వచ్చాను. అధ్యక్షుడు జేవియర్ మిలీతో విస్తృతంగా చర్చించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అర్జెంటీనా జాతీయ నాయకుడు జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అధ్యక్షుడు మిలీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరగనున్నాయి. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన భారత్-అర్జెంటీనా సంబంధాలు వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో మరింత బలపడనున్నాయి.

Read More : ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం తగ్గించిన అమెరికా