కాంటాలగా ఫేమ్ షెఫాలీ హఠాన్మరణంపై హృద్రోగ నిపుణుల విశ్లేషణ

ప్రముఖ నటి షెఫాలీ జరివాలా అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌తో మరణించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించిన ఆమె హఠాత్తుగా కుప్పకూలిపోవడం, ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందడం గుండె ఆరోగ్యంపై పెరుగుతున్న అనిశ్చితిని తలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, యువతలో కార్డియాక్ అరెస్ట్ ముప్పు, దానికి కారణాలు, నివారణ చర్యలపై ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ధీరేంద్ర సింఘానియా వివరాలు వెల్లడించారు.

యువతలో గుండెపోటుకు కారణాలేంటి?

యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ సింఘానియా ప్రకారం… స్టెరాయిడ్ల వినియోగం, నిద్రలేమి, హార్మోన్ థెరపీలు, అధిక ఒత్తిడి యువతలో గుండెపోటు ముప్పును పెంచుతున్నాయి. సెలబ్రిటీలు ఫిట్‌గా కనిపించేందుకు అనేక మార్గాలు ప్రయత్నిస్తూ శరీర నియమాలను విస్మరిస్తున్నారని, దీని వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని ఆయన హెచ్చరించారు.

స్టెరాయిడ్లు, డ్రగ్స్, హార్మోన్లు ప్రమాదకరం

శరీర సౌష్టవం కోసం స్టెరాయిడ్లు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, గర్భనిరోధక మాత్రలు వంటివి వాడటం గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్ సింఘానియా తెలిపారు. అలాగే, సోషల్ మీడియా వ్యసనం, నిద్రలేమి, ఆధునిక జీవనశైలి వల్ల రక్తపోటు, కార్టిసాల్ స్థాయిలు పెరిగి గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

షెఫాలీ మరణంపై వైద్యుల అంచనా

షెఫాలీ జరివాలా మృతికి కార్డియాక్ అరెస్టే ప్రధాన కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆమె నివాసంలో గ్లూటాథియోన్, విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ మాత్రలు లభించాయి. అయితే వీటివల్ల గుండెపోటు ముప్పు ఉండదని, కానీ హార్మోనల్ థెరపీలు తీసుకున్నట్లయితే అవి ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్ సింఘానియా అభిప్రాయపడ్డారు. షెఫాలీకి 15ఏళ్ల వయసులో ఎపిలెప్సీ నిర్ధారణ అయిందన్నా, ఆ ఔషధాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో యువత గుండె ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఫిట్‌నెస్‌కు మొగ్గుచూపడం కాదు, జీవనశైలిలో సమతుల్యత, నిద్ర, ఆహారపు నియమాలు పాటించడమే నిజమైన ఆరోగ్య రహస్యం అంటున్నారు.

Read More : 14 భారతీయులను రక్షించిన నౌకాదళం

One thought on “కాంటాలగా ఫేమ్ షెఫాలీ హఠాన్మరణంపై హృద్రోగ నిపుణుల విశ్లేషణ

Comments are closed.