తెలంగాణ గురుకులాల పరిస్థితిపై హరీశ్ రావు ఆవేదన.

harish rao

తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం పట్ల చూపుతోన్న ఉదాసీనతను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు – “గత ప్రభుత్వ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకులాల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులాలకు ఆహార సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఈ ఏడాది జనవరి నుంచే బిల్లులు చెల్లించలేదని ఆరోపించిన ఆయన, ఇప్పటికే కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. జూలై 1 నుంచి పూర్తి సరఫరా నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించడంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతపై సీరియస్ ప్రభావం పడనుందన్నారు. అంతేకాక, గత 13 నెలలుగా గురుకుల భవనాల అద్దె బకాయిలు రూ.450 కోట్లకు పైగా పెరిగిపోయాయని, పలు భవన యజమానులు తాళాలు వేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యార్థులు రోడ్డుపాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా, విద్యార్థులకు యూనిఫాం, స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. చిన్నారులు పాత దుస్తులతో స్కూళ్లకు రావడమన్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాల వ్యవస్థ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్థాయికి దిగజారడం అత్యంత బాధాకరమని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More : తుక్కుగూడ ఓఆర్ఆర్ రోడ్డుపై హిజ్రాల దౌర్జన్యం