అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా జరిపిన సైనిక దాడిని, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌పై జరిగిన హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులతో పోల్చడంపై జపాన్ ప్రభుత్వంతో పాటు బాధితులు, పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎం జరిగింది?
ఇరాన్ అణు ప్రాజెక్టుపై అమెరికా దాడులను ప్రస్తావిస్తూ ట్రంప్ మాట్లాడుతూ, “ఈ దాడి యుద్ధానికి ముగింపునిచ్చింది. హిరోషిమా, నాగసాకి ఉదాహరణలు వాడాలనుకోవడం లేదు, కానీ ఇరాన్‌పై దాడి కూడా దాదాపు అలాంటిదే” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జపాన్ నుంచి తీవ్ర స్పందన
ఈ వ్యాఖ్యలపై జపాన్ తీవ్రంగా స్పందించింది. అణుదాడి బాధితులు, పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగసాకి మేయర్ షిరో సుజుకి స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యలు అణుబాంబు దాడిని సమర్థించేలా ఉన్నాయని, ఇది బాధితులకు బాధాకరమని అన్నారు. నిహాన్ హిడాంక్యో సహ-అధ్యక్షుడు మిమాకి తోషియుకి, బాధితురాలు టెరుకో యోకోయామా కూడా ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
హిరోషిమాలో నిరసనలు – చట్టసభ తీర్మానం
హిరోషిమాలో బాధితులు, పౌరులు భారీగా ప్రదర్శనలు నిర్వహించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హిరోషిమా చట్టసభ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ, అణ్వాయుధ వినియోగానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.
జపాన్ ప్రభుత్వ స్పందన
జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హయాషి యోషిమాస మాట్లాడుతూ, “అణుబాంబుల విషయంలో మా వైఖరిని అమెరికాకు మేము ఇప్పటికే ఎన్నిసార్లు తెలియజేశాం” అని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-జపాన్ సంబంధాల్లో చారిత్రక సున్నితతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి.
Read More : అమెరికా నిధుల కోతతో లక్షల చిన్నారుల ప్రాణాలకు ముప్పు

2 thoughts on “Trump’s comments – హిరోషిమా, నాగసాకి అణుదాడులతో పోలిక కలకలం”
Comments are closed.