ఉగ్రవాదానికి శూన్య సహనం – రాజ్‌నాథ్

చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, అణ్వాయుధాల వ్యాప్తి వంటి ప్రాణాంతక సవాళ్లను ఎదుర్కొనడంలో సభ్య దేశాలన్నీ ఐక్యంగా, నిర్దిష్ట లక్ష్యాలతో ముందడుగు వేయాలన్నారు. ఉగ్రవాదం కొనసాగితే శాంతి, అభివృద్ధికి అవకాశం ఉండదని స్పష్టం చేసిన రాజ్‌నాథ్, తీవ్రవాదం, రాడికలైజేషన్, పరస్పర నమ్మక లోపం వంటి అంశాలు ప్రాంతానికి ప్రధాన ప్రమాదాలుగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే కొన్ని దేశాల విధానాలపై రాజ్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. “ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదు. ఎస్‌సీవో వీటిపై నిర్భయంగా స్పందించాలి” అని పిలుపునిచ్చారు.

భారత్ ఉగ్రవాదంపై ఎలాంటి రాజీపడదని మరోసారి స్పష్టం చేసిన ఆయన, పహల్గామ్ దాడి తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భారత్ శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడంలో వెనుకాడదని స్పష్టంచేశారు.

యువత రాడికలైజేషన్ బారిన పడకుండా గ్లోబల్ స్థాయిలో చర్యలు అవసరమని రాజ్‌నాథ్ నొక్కిచెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక విభాగం (రాట్స్) కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఆయుధాలు, మాదకద్రవ్యాల రవాణా జరుపుతున్న ఉగ్రవాద శక్తులను అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘సర్వే జనాః సుఖినో భవంతు’ అనే భారతీయ తత్వాన్ని ఉదహరించిన రాజ్‌నాథ్, ప్రపంచ శాంతికి పరస్పర సహకారం అవసరమని అన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వానికి భారత్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఎస్‌సీవో సభ్య దేశాల మధ్య నమ్మకం, సహకారం మరింత బలపడాలని కోరుతూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

Read More : ముంబై ఎయిర్ ఇండియా విమానంలో పక్షి గూడు కలకలం.