ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కీలక జలవనరుల అభివృద్ధికి బాటపెడుతూ “జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్” అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పోలవరం నుండి బనకచర్ల వరకు నిర్మించనున్న లింక్ ప్రాజెక్టుతోపాటు ఇతర సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను ఈ కార్పొరేషన్‌ భుజాన వేసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు గతంలో వివాదాస్పదమైన నేపథ్యంలో, ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

గోదావరి జలాల వినియోగమే ప్రధాన లక్ష్యం

ఈ సంస్థ ద్వారా గోదావరి నదిలో సముద్రంలోకి వృథా పోతున్న నీటిని రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు తరలించడం లక్ష్యంగా ఉంది. సాగునీరు, తాగునీరు సమృద్ధిగా అందించేందుకు ప్రయత్నించనుంది. రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

100 శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో…

జలహారతి కార్పొరేషన్‌ను 100 శాతం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతిని కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ ఛైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి సీఎస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని జలవనరుల వినియోగం మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Read More : కాగ్నిజెంట్‌కు మంత్రి లోకేశ్‌ ధన్యవాదాలు

One thought on “ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Comments are closed.