ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం పట్ల రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ, కాగ్నిజెంట్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. విశాఖను కీలక కేంద్రంగా ఎంచుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర యువతలో నూతన ఆశలు రేకెత్తిస్తుందని, వారి ఆత్మవిశ్వాసాన్ని బలపరిచే శుభ సంకేతమని మంత్రి తెలిపారు. విశాఖ కాపులుప్పాడలో కాగ్నిజెంట్ ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ, సన్‌రైజ్ రాష్ట్రానికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తూ, మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షిస్తామని తెలిపారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ క్యాంపస్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి ఇది పెద్ద దోహదం చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : శ్రీశైలం వెళ్లే భక్తులకు గాయాలు

One thought on “కాగ్నిజెంట్‌కు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు”
Comments are closed.