బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శించారు. సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “ఆత్మశుద్ధిలేని యాచార మదియేల.. భాండశుద్ధిలేని పాకమేల” అన్న నానుడిని ఉదహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిని తీవ్రంగా ఎద్దేవా చేశారు.
హరీష్ రావు చేసిన వ్యాఖ్యల ప్రకారం – బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సన్న పంటల బోనస్, ఇందిరమ్మ భరోసా, గ్యాస్ బండపై సబ్సిడి, రాజీవ్ యువ వికాసం, గొర్రెల పంపిణీ వంటి పథకాలన్నీ బంద్ చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు.
“మాటల్ని కోటలు దాటేలా చెబుతారు కానీ చేతల మాత్రం గడప దాటవు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. వాళ్లు మాటల బ్రాండ్ అంబాసిడర్లు” అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
గొర్రెల పంపిణీపై విమర్శలు చేస్తూ, ప్రభుత్వం గొర్రెలను ఇవ్వడమే కాదు, ఇప్పటికే ప్రజలు చెల్లించిన డిపాజిట్లను కూడా తిరిగి ఇవ్వలేకపోతుందని ఆరోపించారు. ఈ వాగ్ధానాల అమలులో విఫలమవడంతో, యాదవ, కురుమ సామాజిక వర్గాలు నిరసనగా గాంధీ భవన్ వద్ద గొర్రెలతో చేరాయని గుర్తుచేశారు.
పంచాయతీ నిధులపై లేఖ:
ఇక పంచాయతీల సమస్యలపై మంత్రి సీతక్కకు లేఖ రాసిన హరీష్ రావు, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలనీ, పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వానాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు.
అలాగే, 2019లో నియమించిన 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, గ్రామాలు మురికిగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read More : జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో భారీ మార్పులు

One thought on “కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ఘాటు విమర్శలు”
Comments are closed.