భారతదేశ మేధోశక్తికి వెన్నెముకగా నిలిచిన “ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)” 76 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గుంటూరు బండ్లమూడి గార్డెన్స్‌లో ICAI గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో “స్ఫూర్తి” పేరిట నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ… ICAI కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ అకౌంటింగ్ సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేసిన తొలి సంస్థగా ICAI నిలిచిందన్నారు. 4.07 లక్షల మంది సభ్యులతో పాటు 54 విదేశీ బ్రాంచీలను కలిగి ఉండటం గర్వకారణమన్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది విద్యార్థులు ఈ కోర్సు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు.
గుంటూరును “చార్టర్డ్ అకౌంటెంట్ల ఫ్యాక్టరీ”గా అభివర్ణించిన లోకేశ్
గుంటూరు నగరం ప్రస్తుతం దేశంలో అత్యధికంగా సీఏలను అందించే కేంద్రంగా మారిందని తెలిపారు. 10 వేల మంది సీఏ విద్యార్థులు అక్కడ విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. గుంటూరులోని ప్రతిభావంతులైన సీఏలు విదేశాల్లోనూ తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.
సీఏలు ఆర్థిక వృద్ధికి మూలశక్తి
సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు కాదు… వారు వ్యాపార అభివృద్ధికి కీలక పాత్రధారులని, పాలనా వ్యవస్థలో ఉన్న ప్రతీ ఫైల్‌కి ఆడిటర్ల ఆమోదం అవసరమని తెలిపారు. రాష్ట్ర లక్ష్యంగా 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించాలన్న లక్ష్యాన్ని వివరించారు.
ఏపీలో అభివృద్ధి మార్గం
క్వాంటమ్ టెక్నాలజీ నుంచి డ్రోన్ సిటీ వరకు, ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అమరావతిలో తొలిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ జరగబోతుందని, చిత్తూరు హెరిటేజ్ సంస్థను తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి విజయవంతంగా నడుపుతున్నారని తెలిపారు.
సీఏలు పాలనలోకి రాలేదంటే అవినీతిపై విజయం సాధించలేం
సీఏలు పాలనా వ్యవస్థలో భాగం అయితే అవినీతిని నివారించడం మరింత సులభమవుతుందన్నారు. టెక్నాలజీ, నైతిక విలువలు, అంకితభావంతో పనిచేసే సీఏలు ఆర్థిక వ్యవస్థకు ఆధారస్తంభాలుగా నిలుస్తారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ICAI వైస్ ప్రెసిడెంట్ డి. ప్రసన్నకుమార్, SIRC వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, గుంటూరు బ్రాంచ్ చైర్మన్ ఎన్. రాజశేఖర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

One thought on “సీఏలే దేశ ఆర్థిక వ్యూహం వెన్నెముక: నారా లోకేశ్”
Comments are closed.