కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమం దేశానికి కంటే చైనా లాంటి దేశాలకు మరింత లాభం చేకూర్చిందని ఆయన ఆరోపించారు. దేశీయంగా తయారీ రంగం క్షీణించడమే కాకుండా నిరుద్యోగిత కూడా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ అక్కడ టెక్నీషియన్లతో మాట్లాడారు. ఆ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “మేక్ ఇన్ ఇండియా వల్ల దేశంలో ఫ్యాక్టరీల పెరుగుదల ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్పారు. కానీ వాస్తవంగా తయారీ రంగం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. యువతలో నిరుద్యోగం పెరిగింది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపు అయ్యాయి” అంటూ ప్రశ్నలు సంధించారు.
ప్రధాన మంత్రి మోదీ నినాదాలు ఇచ్చే విషయంలో నిపుణులేనని, కానీ సమస్యల పరిష్కారాల్లో విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు. “2014 నుంచి తయారీ రంగం వృద్ధి తడిసి మోపెదు అయింది. అసలు తయారీ కాకుండా దిగుమతులు చేసి కేవలం అసెంబ్లింగ్ చేస్తున్నాం. దీని వల్ల లాభాలు చైనాకు పోతున్నాయి” అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా పూర్తి స్థాయి తయారీ విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. తయారీ రంగానికి ఇచ్చే ప్రోత్సాహాలను కూడా కేంద్రం తగ్గిస్తోందని ఆరోపించారు. “భారతదేశం ఇతర దేశాలకు కేవలం మార్కెట్‌గా మిగిలిపోవద్దు. మన ఉత్పత్తులు మనమే తయారు చేసి, మనమే వినియోగించుకోవాలి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్రానికి ఉంది” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Read More : అహ్మదాబాద్ ఘటనపై ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు

One thought on “మేక్ ఇన్ ఇండియా పూర్తిగా విఫలమైందన్న రాహుల్ గాంధీ”
Comments are closed.