చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈ మేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ను పన్నీర్ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్డీయే కూటమితో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పన్నీర్ సెల్వం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. పొత్తుల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన సమయం కాదని, ఎన్నికల ముంగిట ఆ అంశం గురించి మాట్లాడతామని అన్నారు.
మరోవైపు, ఇటీవల సినీనటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కళగ (టీవీకే)తో సెల్వం చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వాన్ని విలేకరులు పొత్తుల అంశం గురించి ప్రస్తావించగా.. కాలమే చెబుతుంది అంటూ.. సమాధానం దాటవేశారు. పన్నీర్ సెల్వం ఒకానొక సమయంలో ఏఐఏడీఎంకేలో కీలకంగా వ్యవహరించారు. ఎన్డీయే కూటమిలోనూ ముఖ్యపాత్ర పోషించారు. అయితే, పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలతో బహిష్కరణకు గురైన ఆయన.. సొంతంగా తన వర్గాన్ని విస్తరించుకున్నారు. తాజాగా ఎన్డీయే నుంచి కూడా బయటకు రావడం.. 2026 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఓ సర్వేలో 2026 లో టీవీకే పార్టీకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, అనుభజ్ఞుడు పన్నీర్ సెల్వం టీవీకే తో చేతులు కలిపితే విజయ్ కు ఎదురుండదేమో!

One thought on “ఎన్డీయేకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం.. ఆసక్తికరంగా తమిళ రాజకీయాలు”
Comments are closed.