విశాఖపట్నం: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడిగా వ్యవహరిస్తున్నారని, కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ వ్యాఖ్యలపై మండిపాటు
వైఎస్ జగన్ తరచూ వైలెంట్ డైలాగులు వాడటం సరికాదని షర్మిల అభిప్రాయపడ్డారు. “నరికేస్తాం” వంటి పదాలు మాట్లాడటమే కాదు, వాటిని సమర్థించడం కూడా ప్రజాస్వామ్యానికి ముప్పుగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి భాషను ప్రజలు తేలికగా తీసుకోరని హెచ్చరించారు.
మోదీపై విమర్శలు – హోదాపై ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనపై కూడా షర్మిల తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారని ఆరోపించారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగన్ మౌనం పాటిస్తున్నారని విమర్శించారు.
పోలవరం, రాజధానిపై కేంద్రం బాధ్యత వహించాలి
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించిన షర్మిల, ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. అమరావతి రాజధానిని నిర్మించడం కూడా కేంద్ర బాధ్యత అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తిప్పి కొడుతూ, మోదీ దీనిపై తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ే ప్రత్యామ్నాయ శక్తి
ప్రజల సమస్యలపై గళమెత్తే ఏకైక పార్టీ కాంగ్రెస్పార్టీయేనని షర్మిల పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం కన్నా, ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనది అభివృద్ధి, న్యాయం అని తెలిపారు. జిల్లా నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించామని వివరించారు.
Read More : అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో వీవీఆర్ కృష్ణరాజు పోలీసు కస్టడీలో

One thought on “వైఎస్ జగన్ బీజేపీ దత్తపుత్రుడు: షర్మిల తీవ్ర విమర్శలు”
Comments are closed.