ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు రైతులు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రైతుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. గిట్టుబాటు ధరలు లేవన్న వేదనతో, అప్పుల భారం తాళలేక పల్నాడు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ (45) అనే రైతు పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అప్పుల బరువుతో తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇక అదే మండలానికి చెందిన తూబాడు గ్రామంలో నివసిస్తున్న సిరిబోయిన గోపాల్ రావు (44) కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. అప్పుల ఊబిలో చిక్కుకున్న అతని ట్రాక్టర్‌ను అప్పు ఇచ్చిన వారు స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.

ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య (52) ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పండినా సరైన ధర రాక, అప్పుల ఊబిలో చిక్కుకుని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం నష్టాల బాట పడుతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని, గిట్టుబాటు ధరలను నిర్ధారించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read More : YSRCP కార్యకర్త మృతి

One thought on “ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు రైతులు ఆత్మహత్య

Comments are closed.