అమరావతిలో మెగా హెల్త్ హబ్‌కు చంద్రబాబు శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో రూ.19,264 కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని తెలిపారు. ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు పెరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వినూత్న ప్రయోగంగా కొత్త విధానాలు తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

మెగా హెల్త్ హబ్ ఏర్పాటు:
అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ కింద మెగా హెల్త్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దానికి 200 ఎకరాల స్థలం అవసరమవుతుందని, ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయనున్నట్టు వివరించారు. ఇప్పటికే హెల్త్ సిటీలో ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

జిల్లాల వారీగా వ్యాధుల గణాంకాలు:
గత ఐదేళ్లలో వచ్చిన డేటా ఆధారంగా ఎస్సీడీ సర్వే 3.0 ప్రారంభించామని తెలిపారు. జిల్లాల వారీగా వ్యాధుల ప్రాబల్యాన్ని గుర్తించి, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

గుండె సంబంధిత వ్యాధులు: కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువ

డయాబెటిస్‌: గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్

శ్వాస సంబంధిత వ్యాధులు: ప్రకాశం, కర్నూలు, అనంతపురం

క్యాన్సర్‌: మహిళల్లో అధికంగా, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్

లివర్ వ్యాధులు: మగవారిలో ఎక్కువగా, దానికి కారణం మద్యం

హైపర్‌టెన్షన్‌: మహిళల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

ఆహారపు అలవాట్ల మార్పు ద్వారా ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలి:
స్కూల్ స్థాయిలోనే పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. స్వీడన్‌లో ఉప్పు వినియోగం తగ్గించిన ఫలితంగా హార్ట్ ఎటాక్స్ తగ్గిన ఉదాహరణను చూపించారు. రోజూ 30 నిమిషాలు వాకింగ్‌, మిల్లెట్ల వినియోగం, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవాలని సూచించారు.

డిజిటల్ హెల్త్ మానిటరింగ్‌:
ఎడ్యుకేషన్‌తో పాటు హెల్త్ పరంగా AI ఆధారిత న్యూట్రిషనల్ యాప్ రూపొందించామని తెలిపారు. ఇప్పటికే దానికి స్కోచ్ అవార్డు కూడా లభించిందని చెప్పారు. కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్‌ ఏర్పాటు చేసి, ఫేజ్-2లో చిత్తూరులో అమలు చేస్తామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. హెల్త్ రికార్డులను డిజిటల్ లాకర్‌లో భద్రపరచనున్నారు.

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల విస్తరణ:
ప్రస్తుతం 70 చోట్ల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో పీపీపీ మోడల్‌లో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇది ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం కావడంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న మెరుగైన చర్యలుగా చెప్పవచ్చు.

Read More : వైద్య సేవలు నిలిచిన ఏపీకి కాంగ్రెస్ హెచ్చరిక..

One thought on “అమరావతిలో మెగా హెల్త్ హబ్‌కు చంద్రబాబు శ్రీకారం

Comments are closed.