దిల్లీలో మంత్రి లోకేష్ బిజీ షెడ్యూల్

దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీ విషయమై లోకేష్ కార్యాలయ వర్గాలు స్పందిస్తూ.. ఇది మర్యాద పూర్వక సమావేశమేనని స్పష్టం చేశాయి.

అమరావతిలో నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే లోకేష్ ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి మంత్రి లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి హాజరయ్యారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ మరికొన్ని కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై దాని ప్రభావం, ఏపీ లిక్కర్ కేసులో నెలకొన్న పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది. అలాగే రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.

తరువాత మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, సాయంత్రం 4:30 గంటలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 5:30 గంటలకు న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌లతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు.

Read More : కొడాలి నాని అరెస్టు వార్తల్లో నిజం లేదు