హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నగర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు బల్దియా కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో చేరి ఆందోళన ప్రారంభించారు. వీధిదీపాలు, రోడ్ల దుస్థితి, నాలాల పూడిక తీసిపెట్టకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం ప్రారంభమైంది. రామ్‌నగర్ కార్పొరేటర్లు గోడలు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసులు పరస్పరం తోపులాటకు దిగారు.
జీహెచ్ఎంసీ గేటు వద్ద కూర్చొని బీజేపీ నేతలు నిరసనను కొనసాగించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చెబుతున్నప్పటికీ వీధిదీపాలు లేకపోవడంతో నగరం అంధకారంలో మునిగిపోతోందని, దీంతో గల్లీల్లో గంజాయి వ్యసనం పెరిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో యువకులు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమన్నారు.
తెలంగాణవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమను లోపలికి అనుమతించకపోతే కమిషనర్ బయటకు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆందోళన తారా స్థాయికి చేరుకుంది.
Read More : ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

One thought on “జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన.. ఉద్రిక్తత”
Comments are closed.