జగన్‌పై మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం అమరావతిలో విలేకరులతో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు జగన్ కుట్రలు సాగిపోనున్నాయన్న ఆశలు వదిలేయాలన్నారు.

జగన్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారనీ, అలాంటి కుట్రలను ప్రభుత్వం సమూలంగా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అనిత తెలిపారు. ఆ దిశగా ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే వారికి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.

మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడమే జగన్‌కు మానేసి పోయిందని మండిపడ్డారు. పొదిలిలో జరిగిన ఘటనలో పోలీసులు ఎదురు రాళ్లు విసిరి ఉంటే జగన్ చుట్టూ ఎంత మంది మిగిలేవారో ఆలోచించాలన్నారు. కేజీ పొగాకు ధర కూడా తెలియని జగన్ రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ మిగలాలని హితవు పలికారు. మహిళలు, తల్లులు ఆనందంగా ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అయిన వైసీపీకి కడుపు మంట పెడుతుందని ఎద్దేవా చేశారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా సిగ్గుచేటేనన్నారు.

సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో సుప్రీంకోర్టు పూర్తిగా నిర్దోషి అని ఎక్కడా చెప్పలేదని, కేవలం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. జగన్, భారతీలకు క్షమాపణ చెప్పించేందుకు వైసీపీ నేతలు సమావేశాలు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.

పులివెందుల ఎమ్మెల్యేగా కూడా మిగలని పరిస్థితిని జగన్ తెచ్చుకుంటున్నాడని జోస్యం చెప్పారు. తల్లికి వందనం నిధులపై లోకేష్ విసిరిన ఛాలెంజ్‌కు వైసీపీ నేతలు స్పందించలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్‌కు, గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌కు పోలికే లేదని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, పోలీసులపై రాళ్లు విసరడం మేము సహించం అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో జగన్‌కు పేటెంట్ ఉందని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నిలుపుదలపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి వైసీపీ కుట్రలు చేశారని విమర్శించారు.

Read More : కూర్మ గ్రామ అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన

One thought on “జగన్‌పై మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు

Comments are closed.