ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ను శుక్రవారం దాఖలు చేశారు. చెన్నైలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర యువజన సంక్షేమ మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరై కమల్ హాసన్‌కు మద్దతు తెలిపారు.
అసలు కమల్ హాసన్ బుధవారం నామినేషన్ వేయాల్సి ఉన్నా, వ్యక్తిగత, సినీ సంబంధిత కారణాలతో అది వాయిదా పడింది. ఆయన తాజా సినిమా ‘థగ్ లైఫ్’ ప్రచారంలో భాగంగా కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, ఆ అంశాన్ని పరిష్కరించిన తర్వాతే నామినేషన్ వేయాలనే నిర్ణయానికి వచ్చారు. చిత్రం గురువారం విడుదల కావడంతో, శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
కమల్ హాసన్‌తో పాటు డీఎంకేకు చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. 2018లో కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్‌ఎం పార్టీ ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమిలో భాగంగా ఉన్నది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఎంఎన్‌ఎం మద్దతు ప్రకటించింది. ఈ రాజకీయ భాగస్వామ్యంలో భాగంగా, రాజ్యసభలో ఎంఎన్‌ఎం పార్టీకి ఒక స్థానం కేటాయించాలన్న ఒప్పందాన్ని డీఎంకే అంగీకరించింది.
ఈ ఒప్పందాన్ని అమలుచేస్తూ, కమల్ హాసన్‌కు రాజ్యసభ స్థానాన్ని కేటాయించడమైంది. దీంతో ఆయన పార్లమెంటు రాజ్యసభకు అడుగుపెడుతున్నారు.
Read More : ఆర్బీఐ నిర్ణయం: రెపో రేటు తగ్గింపు… రుణగ్రహీతలకు ఊరట.
