నల్గొండ జిల్లాలో విద్యా శాఖను తీవ్రంగా భ్రష్టుపట్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవరకొండ నియోజకవర్గంలోని కొర్రతండ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న టీచర్ పర్వీన్ సుల్తానా విద్యార్థుల రాకపోవడంతో, గత ఏడాది జూలైలో గాగిలాపురం పాఠశాలకు డిప్యూటేషన్ పై వెళ్లారు. అయితే అక్కడ ఆమె విధులకు హాజరుకాకపోయినా, తరచుగా దేవరకొండకు వెళ్లి హాజరు పట్టికలో సంతకాలు వేసినట్లు బయటపడింది.
ఈ వ్యవహారంలో ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్ కీలకపాత్ర పోషించగా, మాజీ ఇన్‌ఛార్జ్ ఎంఈవో సామ్యా నాయక్ కూడా సుల్తానాకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక సంవత్సరం పాటు విధులకు గైర్హాజరు అయిన సుల్తానా పూర్తి జీతం తీసుకుంటూ ఉండటం, ఆ జీతంలో సగం భాగాన్ని హెడ్‌మాస్టర్ వేణుమాధవ్ మరియు సామ్యా నాయక్‌కు షేర్ చేసినట్లు సమాచారం.
ఈ అవినీతిపై ఉపాధ్యాయ సంఘాలు జిల్లాలోని డీఈవో భిక్షపతికి పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు డీఈవో కార్యాలయం ముట్టడి చేయాలని నిర్ణయించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలకు దిగారు.
తదుపరి విచారణలో అవకతవకలు స్పష్టమైన నేపథ్యంలో మహిళా టీచర్ పర్వీన్ సుల్తానాతో పాటు హెడ్‌మాస్టర్ వేణుమాధవ్, మాజీ ఇన్‌ఛార్జ్ ఎంఈవో సామ్యా నాయక్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
Read More : 16 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య

One thought on “ప్రభుత్వ జీతం తీసుకున్న టీచర్ – చివరికి వారిపై సస్పెన్షన్.”
Comments are closed.