సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నోటీసులు.

పుష్పా సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్‌ఆర్సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనలో పోలీసులు బాధ్యత తప్పారని ఆరోపణల నేపథ్యంలో, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని గతంలోనే పోలీసులను ఆదేశించిన కమిషన్, తాజాగా అందిన నివేదికలో సక్రమమైన వివరాలు లేవని పేర్కొంది. పోలీస్ స్టేషన్‌ సమీపంలో డీజేలు, పెద్ద ఎత్తున అభిమానుల గుమికూడడం వంటి పరిస్థితుల్లో పోలీసులు ఎందుకు స్పందించలేకపోయారో స్పష్టత కావాలంటూ నిలదీసింది.

పోలీసుల నివేదికలో, ఈ తొక్కిసలాటకు కారణం సినీ నటుడు అల్లు అర్జున్ రాకేనని, లాఠీ ఛార్జ్ జరగలేదని పేర్కొనడాన్ని కమిషన్ గమనించింది. స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్‌కు ఎలా వచ్చారన్నది ముఖ్యమైన ప్రశ్నగా నిలుస్తోంది.

పూర్తి భద్రతా ఏర్పాట్లు లేకుండా అభిమానులను సమీకరించడంలో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. మానవ హక్కుల ఉల్లంఘనలున్నాయని భావించి, ఈ విషయంపై మరింత స్పష్టమైన నివేదికను సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుపై సీవీ ఆనంద్ నుంచి వెంటనే వివరణ రప్పించాలని కోరిన కమిషన్, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Read More : మంత్రి కోమటిరెడ్డి, డీకే అరుణ ఘాటుగా స్పందన.