పహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ తో కఠిన ప్రతీకారం

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం తక్షణమే తగిన స్పందన తెలిపిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.

22 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం

‘‘ఉగ్రదాడికి ప్రతిగా మే 7న భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో కేవలం 22 నిమిషాల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ప్రధాన స్థావరాలను ధ్వంసం చేశాం,’’ అని మోదీ తెలిపారు. పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు పోయిన విషాదాన్ని గుర్తు చేస్తూ, “ఈ చర్యలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు” అని వెల్లడించారు.

పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

“నా నరాల్లో రక్తం కాదు, సిందూరం మరుగుతోంది. భారత్‌ ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పే దేశంగా మారింది. పహల్గామ్ దాడి తూటాలు 140 కోట్ల భారతీయుల గుండెల్లో గుచ్చుకున్నాయి. మేము ఉగ్రవాద గుండెల్లోనే బలమైన దెబ్బ కొట్టాం. సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయి,” అని మోదీ ఉత్సాహంగా తెలిపారు.

రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ, ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద పునరుద్ధరించిన దేష్నోక్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. బికనీర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రసిద్ధ కర్ణిమాత ఆలయంలో పూజలు నిర్వహించి, అక్కడి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.

Read More : జ్యోతి మల్హోత్రా కేసులో ఉగ్రవాద సంబంధాలు లేవని పోలీసులు.

One thought on “పహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ తో కఠిన ప్రతీకారం

Comments are closed.