‘మినిట్‌మ్యాన్-3’ పరీక్ష విజయవంతం..

అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘మినిట్‌మ్యాన్‌-3’ను విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్‌ స్పేస్ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. గంటకు 15,000 మైళ్లు (సుమారు 24,000 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించిన ఈ క్షిపణి, 4,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్షల్ దీవుల్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన టెస్టింగ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఈ పరీక్ష అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ప్రకారం, దేశ రక్షణ సన్నద్ధతను సూచించే దృఢమైన సంకేతమని జనరల్ థామస్ బుస్సెరీ తెలిపారు. ఈ ప్రయోగానికి ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేదని, ఇది సాధారణంగా నిర్వహించే రక్షణ పరీక్షల్లో భాగమని ఆయన స్పష్టం చేశారు.

ఈ మినిట్‌మ్యాన్-3 క్షిపణిలో అత్యంత శక్తివంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ అమర్చారు. అవసరమైతే దీనిలో అణ్వాయుధాలను కూడా మోహరించవచ్చు. గతంలో అనేకసార్లు ఈ క్షిపణిని పరీక్షించిన అమెరికా, ఇప్పటికీ దీనిని అత్యంత నమ్మకమైన ఆయుధంగా భావిస్తోంది. 1970లలో ప్రవేశపెట్టిన మినిట్‌మ్యాన్ క్షిపణి వ్యవస్థకు బదులుగా త్వరలో ‘సెంటెనిల్ సిస్టమ్’ను ప్రవేశపెట్టాలని అమెరికా యోచిస్తున్నా, మినిట్‌మ్యాన్-3 ప్రస్తుతం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ పేరుతో అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రకటించారు. ఇజ్రాయెల్ వినియోగిస్తున్న ‘ఐరన్ డోమ్’ తరహాలో రూపొందించనున్న ఈ వ్యవస్థ, భవిష్యత్తులో శత్రు క్షిపణులు లేదా అణ్వాయుధాలు అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పనిచేస్తుందని వివరించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు (రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని ట్రంప్ తెలిపారు. ఈ నిర్మాణ బాధ్యతలను యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్‌కు అప్పగించారు. తన పదవీకాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన ‘మినిట్‌మ్యాన్-3’ పరీక్షల తరుణంలో రావడం, అమెరికా అంతరిక్షంలో కూడా రక్షణ వ్యూహాలను మరింత బలోపేతం చేస్తుందనే సంకేతాలు ఇస్తోంది.

Read More : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిపై దుండగుల దాడి.

One thought on “‘మినిట్‌మ్యాన్-3’ పరీక్ష విజయవంతం..

Comments are closed.