పాక్‌లో మళ్లీ భూమి కంపించేసరికి కలకలం..!

పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి భూకంపం నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 1:26 గంటల సమయంలో భూమి కంపించినట్టు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రకంపనల కారణంగా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు అందలేదని స్పష్టం చేశారు.

గత మూడు రోజుల వ్యవధిలో పాకిస్థాన్‌లో ఇది మూడోసారి భూకంపం సంభవించిన ఘటన కావడం గమనార్హం. శనివారం జరిగిన రెండు భూకంపాల్లో ఒకటి 5.7 తీవ్రతతో, మరొకటి 4.0 తీవ్రతతో నమోదైనట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

భూ ఉపరితలానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పుడు, తీవ్రంగా ప్రకంపనలు వచ్చి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శనివారం సంభవించిన భూకంపాలు కూడా అలాంటివేనని అంచనా వేస్తున్నారు.

భౌగోళికంగా పాకిస్థాన్ అత్యంత క్రియాశీలక భూభాగంలో ఉంది. భారత, యురేషియా ఫలకాల మధ్య సరిహద్దులో ఉండటంతో ఈ ప్రాంతంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిత్-బల్టిస్థాన్ ప్రాంతాలు భూకంప రేఖలపై ఉండటంతో ఎక్కువ ప్రమాదం వుంది.

ఇలాంటి వరుస భూకంపాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read More : పాకిస్థాన్ మళ్లీ మాస్క్ చించుకుంది

One thought on “పాక్‌లో మళ్లీ భూమి కంపించేసరికి కలకలం..!

Comments are closed.