పాక్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయలేదని భారత్ స్పష్టం..

ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ అణు నిల్వలపై దాడులు జరిగాయనే ఊహాగానాలకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పష్టత ఇచ్చారు. భారత త్రివిధ దళాలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ వద్ద అణు నిల్వలపై భారత్ దాడి చేసిందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ— ‘‘కిరానా హిల్స్‌లో అణ్వాయుధాలు ఉన్నాయని మీరు చెబుతున్న సమాచారం కొత్తదే. మేము నిర్వహించిన ఆపరేషన్‌లో ఆ ప్రాంతం మా లక్ష్యాల్లో భాగంగా లేదు. మేము ఆయుధ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. ఊహాగానాలకు ఈ ప్రకటనతో ముగింపు పలుకుతుందని భావిస్తున్నాను’’ అని తెలిపారు.

గత కొన్ని రోజులుగా కిరానా హిల్స్‌, సర్గోధా ఎయిర్‌బేస్‌ పరిధిలో దాడులు జరిగాయన్న వార్తలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అణ్వాయుధాల నిల్వలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో, భారత్‌ దాడి చేసి ఉండవచ్చన్న అనుమానాలు రేగాయి. పాక్‌లో ఇటీవల సంభవించిన భూకంపాలకూ ఈ దాడికే కారణమంటూ ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, ఎయిర్ చీఫ్ స్పష్టత‌తో ఈ వదంతులకు ముగింపు లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More : పుణెలో డొమినోస్ ఎదుట నిరసన..