ఆర్మీ మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కీలక వ్యాఖ్యలు.

భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా ముదురుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ చేస్తున్న కదలికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని భారత ఆర్మీ స్పష్టం చేసింది. “పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దులవైపు కదులుతోంది. ఇది తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉంది” అని ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.

శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆర్మీ మీడియా సమావేశంలో, “ఆపరేషన్ సిందూర్”కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోఫియా ఖురేషీ మాట్లాడుతూ, “పాకిస్థాన్, ఉద్రిక్తతలను తగ్గించే బదులు అవి మరింత పెరిగేలా ప్రవర్తిస్తోంది. శనివారం తెల్లవారుజామున పంజాబ్ ప్రాంతంలో ఉన్న భారత వైమానిక స్థావరాలపై హైస్పీడ్ మిసైళ్లతో దాడులు చేసింది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ లలోని వైద్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఇది మానవత్వానికి, అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది” అని మండిపడ్డారు.

పాక్ దాడులకు తగిన ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా చర్యలు తీసుకుందని వివరించారు. ఫైటర్ జెట్ల ద్వారా పస్రూర్‌లోని రాడార్ కేంద్రం, సియాల్‌కోట్‌లోని ఏవియేషన్ బేస్‌ను ధ్వంసం చేశామని తెలిపారు. అత్యంత ఖచ్చితమైన ఆయుధాలను ఉపయోగించి ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు.

ఇక వాయుసేన ప్రతినిధి వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, “భారత స్థావరాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయ్. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి తగిన ఆధారాలతోనే ఎదురుదెబ్బ కొడుతున్నాం” అన్నారు. ఈ ప్రకటనలన్నింటికీ తోడు, టైమ్‌స్టాంప్ ఉన్న వీడియోలు, ఫోటోలు కూడా మీడియాకు చూపించారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్ మాత్రం నిబంధనల పరిధిలో వ్యవహరిస్తోందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.

Read More : పెళ్లైన జవాన్ మనోజ్ పాటిల్ దేశసేవలోకి.