భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించబడింది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్, ట్యాంక్‌బండ్ వంటి కీలక ప్రాంతాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ బస్‌స్టాండ్, ఎంజీ రోడ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
హైదరాబాద్ నగరం మొత్తం హైఅలర్ట్ జోన్‌లో ఉండగా, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో పోలీసుల సూచనలు అమలులో ఉన్నాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను విస్మరించాలనే సూచనలను కూడా ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ఆరు హైఅలర్ట్ జోన్లలో అక్టోపస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చే నష్టకరమైన చర్యల నేపథ్యంలో టీటీడీ అధికారులకు కేంద్ర హోంశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమలలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
మరిన్ని భద్రతా చర్యలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు కావాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని ముఖ్యమైన అధికారులను ఆదేశించింది. పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర చర్యలను చేపడుతుండగా, పోర్టులు, షిప్పింగ్ టర్మినల్స్‌లో భద్రతను పెంచే చర్యలు తీసుకున్నారు.
రైల్వే స్టేషన్లలో కూడా భద్రత పెంచినట్లు సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉద్యోగుల సెలవులు రద్దు చేయడంతో పాటు, ఆర్పీఎఫ్, ఇంటెలిజెన్సీ పోలీసులు నిఘా పెంచినట్లు చెప్పారు. అవసరమైతే రైళ్లను రద్దు చేసే అవకాశాన్ని సూచించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు తెలిపారు.
Read More : జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం , వైఎస్ జగన్ పరామర్శ.

2 thoughts on “భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్..”
Comments are closed.