నక్సల్స్ ఉనికిని ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. గ్రేహౌండ్స్ కమాండోలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగు మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన భద్రతా దళాలు మావోయిస్టుల వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరోసారి నక్సల్స్ తలదాచుకుని ఉండే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇదే తరుణంలో ఇవాళ ఉదయం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో 20మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ అధికారికంగా ధృవీకరించారు. మృతి చెందిన వారిలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ల్యాప్టాప్‌లు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
మావోయిస్టుల ఆగడాలకు తెరదించేందుకు, ఆయా ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు భద్రతా దళాలు ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో బిజీగా ఉన్నాయి. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ ఈ ఆపరేషన్లు చేపడుతున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read More : వైఎస్ జగన్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందన

One thought on “ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్”
Comments are closed.