సమీకృత భద్రతపై సీఎం కీలక సమీక్ష

ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో రాజకీయం కాదు, దేశ భద్రతే ప్రథమమని సీఎం స్పష్టం చేశారు.

ముఖ్యమైన సూచనలు:

  • హైదరాబాద్ నగరంలో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
  • ఐటీ సంస్థల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలి అని సూచించారు.
  • అత్యవసర సేవలలో పని చేస్తున్న ఉద్యోగుల సెలవులు తక్షణమే రద్దు చేయాలని తెలిపారు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, అధికారులు అందరూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
  • విదేశీ పర్యటనల కోసం అనుమతులు పొందిన అధికారులు, మంత్రులు వాటిని తక్షణమే రద్దు చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
  • సోషల్ మీడియా లేదా మీడియా ద్వారా అనవసర ప్రకటనలు చేసే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
  • ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందించేందుకు 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు.
  • శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరిపైనా మినహాయింపు లేకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

వైద్య మరియు ఆహార రంగాలపై ప్రత్యేక దృష్టి:

  • బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉంచాలని,
  • అత్యవసర మందులు తగిన మోతాదులో నిల్వ చేయాలని,
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల సమాచారం ఎప్పటికప్పుడు పొందాలని ఆదేశించారు.
  • ఆహార సరఫరాలో అంతరాయం రాకుండా తగినన్ని నిల్వలు ఉంచాలని సూచించారు.

సైబర్ భద్రత మరియు సమాచార నియంత్రణ:

  • ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని,
  • రాజధానిలోని మూడు కమిషనరేట్‌ పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
  • సున్నిత ప్రాంతాలన్నిటిలో భద్రతను పెంచాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీసు బలగాలను అలర్ట్‌లో ఉంచాలని సూచించారు.
  • హైదరాబాద్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలకు అదనపు భద్రత కల్పించాలని అన్నారు.
  • అవసరమైతే పీస్ కమిటీలతో చర్చలు జరిపి సామరస్యాన్ని ప్రోత్సహించాలని సీఎం అన్నారు.

ఈ సమీక్షలో రాష్ట్ర హోం శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Read More : భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ర్యాలీ