గాజువాక నుంచి 28 వేల మంది తరలింపు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (శనివారం) విశాఖపట్నంలో జరగనున్న గ్రాండ్ యోగా కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

ప్రత్యేకంగా గాజువాక ప్రాంతం నుంచి యోగా వేదికకు సుమారు 28,000 మంది ప్రజలు తరలింపుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఇందుకోసం మొత్తం 288 బస్సులను సిద్ధంగా ఉంచినట్లు జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎటువంటి అసౌకర్యం లేకుండా సకాలంలో వేదిక వద్దకు చేరేలా మార్గాలను ముందుగానే పరిశీలించారు.

ఈ క్రమంలో శుక్రవారం గాజువాకలో 11 బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సుల రాకపోకలకు అనువైన మార్గాలు, సమయపాలన తదితర అంశాలను ఇందులో పరీక్షించారు. ట్రయల్ విజయవంతమైందని, అందుకు అనుగుణంగా తుది ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే నేపథ్యంలో రవాణా వ్యవస్థలో ఏ మాత్రం లోపాలు చోటు చేసుకోకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు జీవీఎంసీ పేర్కొంది. యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రజల సకాలంలో హాజరును నిర్ధారించడం తమ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

Read More : బనకచర్లపై ఏపీతో చర్చలకు సిద్ధం: సీఎం

One thought on “గాజువాక నుంచి 28 వేల మంది తరలింపు

Comments are closed.