గాజాలో భవనం పేల్చి జెండర్ రివీల్ పార్టీ..?

గాజాలో ఇజ్రాయెల్ సైనికులు (IDF) ఓ నివాస భవనాన్ని పేల్చి, దాన్ని ‘జెండర్ రివీల్ పార్టీ’గా మార్చిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సైనికులు పేలుడు పదార్థాలతో ఓ భవనాన్ని ధ్వంసం చేయగా, శిథిలాల నుంచి నీలం, బూడిద రంగు పొగలు వెలువడుతున్నాయి. నీలం రంగు పొగను చూసి “పుట్టబోయేది అబ్బాయే!” అంటూ అక్కడున్నవారు సంబరాలు జరుపుకుంటున్నట్లు వినిపిస్తోంది.

సైనికులే వీడియోను షేర్ చేసినట్లుగా సమాచారం

ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థ ‘అల్ జజీరా’ కథనం ప్రకారం, ఈ వీడియోను ఇజ్రాయెల్ సైనికులే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు.

ఈ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజన్లు ఈ చర్యను “అమానవీయమైనది”, “హేయమైన చర్య”గా అభివర్ణిస్తూ, సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు “ఇవ్వాళ ప్రపంచంలోనే అత్యంత నీచంగా మారుతున్న చర్యలలో ఇదొకటి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఇలాంటి చర్యలపై ఎందుకు స్పందించటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇజ్రాయెల్ నుంచి గాజాపై మరిన్ని దాడుల సూచన

ఇక, గాజా ప్రాంతంపై తన ఆర్మీ నియంత్రణ కల్పించాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలిపిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హమాస్ పై తీవ్ర దాడులు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

జెండర్ రివీల్ పార్టీ అంటే ఏమిటి?

జెండర్ రివీల్ పార్టీ అనేది గర్భిణీకి జరిపే ఓ ప్రత్యేకమైన వేడుక. పుట్టబోయే బిడ్డ అబ్బాయా, అమ్మాయా అన్నది కుటుంబ సభ్యుల సమక్షంలో సరదాగా తెలియజేసే కార్యక్రమం. ఇందులో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేసి, అందులో ఉండే రంగు ఆధారంగా (గులాబీ – అమ్మాయి, నీలం – అబ్బాయి) అంచనా వేయడం జరగుతుంది. ఇది చాలా దేశాల్లో ఆనందంగా జరుపుకునే ఓ కుటుంబ వేడుక.

ఇక ఇజ్రాయెల్ సైనికులు ఇటువంటి ఒక మానవీయ విషాదాన్ని వినోద కార్యక్రమంగా చూపించడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.

Read More : మెట్‌గాలా నిబంధనలపై ఫోకస్: సెలబ్రిటీలకు పెట్టిన ఆంక్షలు

One thought on “గాజాలో భవనం పేల్చి జెండర్ రివీల్ పార్టీ..?

Comments are closed.