Apple ఇంటర్నెట్ డెస్క్: ప్రైవసీ పరంగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) మంచి పేరు సంపాదించుకుంది. అయితే, అదే సంస్థ తన ఉద్యోగుల వ్యక్తిగత పరికరాలపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టుతోందని ఒక ఉద్యోగి ఆరోపించాడు. ఐక్లౌడ్ ఉపయోగించి ఉద్యోగులు తమ వేతనాలు, పని వాతావరణం వంటి అంశాలపై ఎక్కడా చర్చించకుండా అడ్డుకుంటోందని ఆరోపణలు వెలువడ్డాయి.
క్యాలిఫోర్నియాలోని అమర్ భక్త అనే ఉద్యోగి ఆదివారం యాపిల్‌పై కేసు దాఖలు చేశాడు. యాపిల్ ఉద్యోగుల ఫోన్లు, ఇతర పరికరాల్లో సాఫ్ట్వేర్ ఇన్‌స్టాల్ చేసి, వ్యక్తిగత సమాచారం—ఈమెయిల్స్, ఫోటోలు, హెల్త్ డేటా, స్మార్ట్ హోమ్ డేటా—అన్ని యాక్సెస్ చేస్తోందని అతను ఆరోపించాడు. అంతేకాదు, గోప్యతా విధానాల పేరుతో కంపెనీ ఉద్యోగులను తమ పని వాతావరణం గురించి ఎక్కడా మాట్లాడకుండా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నాడు.
అమర్ భక్త 2020 నుండి యాపిల్‌లో పని చేస్తున్నాడు. తన పని గురించి పాడ్కాస్ట్‌లలో చర్చించకూడదని, లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి తన పని వివరాలు తొలగించాలని కంపెనీ నిబంధనలు విధించిందని వెల్లడించాడు. యాపిల్ నిఘా విధానాలు కఠినంగా ఉండడమే కాకుండా చట్ట విరుద్ధమైనవని, వీటితో ఉద్యోగి హక్కులు, పోటీతత్వం వంటి అంశాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయని తెలిపాడు.
ఈ ఆరోపణలపై యాపిల్ ప్రతినిధి స్పందిస్తూ, దావాలోని అంశాల్లో వాస్తవం లేదని, తమ ఉద్యోగుల హక్కులపై ప్రతి ఏడాది శిక్షణ అందిస్తున్నామని స్పష్టంచేశారు. “మేము అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడంపై దృష్టి పెట్టాం. వినియోగదారుల కోసం సృజనాత్మకతను కాపాడుతాము,” అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, జూన్‌లో యాపిల్‌పై మరో ఇద్దరు మహిళా ఉద్యోగుల తరఫున పిటిషన్ దాఖలైంది. ఇంజినీరింగ్, మార్కెటింగ్, కేర్ డిజైన్ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు తక్కువ వేతనం చెల్లిస్తున్నారని ఆరోపించారు. యాపిల్ ఆ ఆరోపణలను కూడా ఖండించింది. తమ సంస్థలో సమాన వేతనం అమలులో ఉందని స్పష్టం చేసింది. ఈ కేసులతో పాటు, యాపిల్ ప్రస్తుతం మరో మూడు దావాలను కూడా యాపిల్ ఎదుర్కొంటోంది.
